న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు ముదరడం, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాల నేపథ్యంలో సిద్ధూ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంకలతో జరిపిన భేటీ వంటి అంశాలు ఇరువురి నేతల మధ్య ప్రస్తావనకు రానున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా సిద్ధూ పేరును ప్రియాంక ప్రతిపాదించినట్టు సమాచారం.
అయితే ఈ ఫార్ములాను అమరీందర్ సింగ్ వర్గీయులు అంగీకరించలేదని తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా సిక్కుయేతర నేతను నియమించాలని కెప్టెన్ సింగ్ కోరుతున్నారు. ఇక కెప్టెన్ అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం సిద్ధూకు డిప్యూటీ సీఎం, ప్రచార కమిటీ చీఫ్ వంటి పదవులను కట్టబెట్టడంపైనా పార్టీ హైకమాండ్ కసరత్తు సాగిస్తోంది. పంజాబ్ పార్టీలో వర్గపోరుకు చెక్ చెబుతూ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసే క్రమంలో సీఎం అమరీందర్ సింగ్తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.