Pune | పుణె : వర్షం ఓ హిందూ జంట పెండ్లికి ఆటంకం కలిగిస్తే ముస్లిం కుటుంబం మత సామరస్యం ఆ ఆటంకానికి పరిష్కారం చూపించి ఆదర్శంగా నిలిచింది. మంగళవారం సాయంత్రం పుణెలో ఈ ఘటన జరిగింది. వాన్వోరి ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన వలీమా (పెండ్లి రిసెప్షన్) వేడుక జరుగుతుండగా.. దగ్గర్లోనే ఉన్న అలంకరణ్ మైదానంలో ఓ హిందూ జంట పెండ్లికి వర్షం ఆటంకం కలిగించింది. ‘వేదిక చుట్టూ చిత్తడిగా మారడంతో మేం సప్తపది కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొద్దిసేపు వారి హాల్‌ను వాడుకొనేందుకు అనుమతివ్వాలని కాజీ కుటుంబాన్ని విజ్ఞప్తి చేశాం’ అని హిందువుల పెండ్లి కుమారుడి కుటుంబ సభ్యుడొకరు తెలిపారు.
దానికి వారు అంగీకరించి వెంటనే వేదికను ఖాళీ చేశారని..వాళ్ల అతిథులు తమకు సప్తపది నిర్వహణ ఏర్పాట్లలో సాయం కూడా చేశారని ఆయన వెల్లడించారు. దీంతో పెండ్లి తంతు సజావుగా సాగిందన్నారు. రెండు కొత్త జంటలైన సంస్కృతి పాటిల్-నరేంద్ర పాటిల్, మహీన్-మోషిన్ కాజీ వేదిక మీద కలిసి ఫొటోలు తీసుకున్నారని ఆయన చెప్పారు.