Navy | మహారాష్ట్రలోని పుణేలో వివిధ రక్షణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న నిబే డిఫెన్స్, ఏరోస్పేస్ తయారీ ప్లాంట్ను భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సోమవారం ప్రారంభించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అడ్మిరల్ హరి కుమార్ మాట్లాడుతూ 2047 నాటికి భారత నౌకాదళం స్వావలంబన సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనలో పరిశ్రమలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
స్వావలంబన అంటే భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థను తయారు చేయడమన్నారు. నేవీ చీఫ్ మాట్లాడుతూ భారత నావికాదళం స్వయం సమృద్ధిగా మారడానికి కట్టుబడి ఉందన్నారు. 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధిస్తామని, ఇందుకు పరిశ్రమల సహకారం అవసరమని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిపారు. స్వావలంబన జాతీయ దృక్పథానికి అనుగుణంగా దేశంలో మన సొంత ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోందని నేవీ చీఫ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిఫెన్స్ షిప్ రంగంలో సాధించిన పురోగతిని ఆయన వివరించారు.