Pulasa Fish | యానాం మార్కెట్లో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాటలో రెండు కిలోల బరువున్న పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించింది. ఈ సీజన్లో ఇదే అధిక ధర అని స్థానికులు తెలిపారు. గత ఏడాది పులస రూ.25వేలు పలికింది. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక మేటల కారణంగా సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
వర్షాకాలం మొదట్లో పులస చేపలు మార్కెట్లో కనిపిస్తుండగా.. పులసను సొంతం చేసుకునేందుకు జనాలు పోటీపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గర పులసలు ఎక్కువగా దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు.