Pooja Khedkar | న్యూఢిల్లీ/ముంబై, జూలై 31(నమస్తే తెలంగాణ): వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై వేటు పడింది. ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులోనూ ఆమె కమిషన్ నిర్వహించే పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం విధించింది. ఈ మేరకు యూపీఎస్సీ బుధవారం ప్రకటించింది. పూజ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 (సీఎస్ఈ-2022) ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్టు తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలు, సెలక్షన్ల నుంచి ఆమెను శాశ్వతంగా డీబార్ చేసినట్టు వివరించింది. అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజకు యూపీఎస్సీ జూలై 18న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 25న అవసరమైన పత్రాలతో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
అయితే, పత్రాలు సమకూర్చుకునేందుకు ఆగస్టు 4 వరకు సమయం ఇవ్వాలని పూజ కోరారు. అందుకు నిరాకరించిన అధికారులు జూలై 30న మధ్యాహ్నం 3.30 గంటల్లోపు హాజరు కావాలని, ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. అయినప్పటికీ యూపీఎస్సీ ఎదుట హాజరై వివరణ ఇవ్వడంలో విఫలం కావడంతో పూజ ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు, భవిష్యత్తులోనూ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షల్లో పాల్గొనకుండా పూజా ఖేద్కర్‌పై శాశ్వత నిషేధం విధించారు.