ముంబై, జూలై 3: ఎన్సీపీ సీనియర్ నేతగా ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటుతో అధ్యక్షుడు శరద్ పవార్‌కు గట్టి షాకే ఇచ్చారు. అయితే మహరాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. గతంలో కూడా డిప్యూటీ సీఎంగా చేసిన అజిత్ పవార్ ఇప్పుడు కూడా కేవలం డిప్యూటీ సీఎం పదవి కోసమే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌పై తిరుగుబాటు చేశాడా? లేక ఇంకేమైనా డీల్ ఉన్నదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఈ తతంగానికి ముందు అంతర్గతంగా పెద్ద రాజకీయమే నడిచిందని, త్వరలో సీఎం కుర్చీలో ఏక్నాథ్ షిండే స్థానంలో అజిత్ పవార్‌ను తీసుకొచ్చే ఉద్దేశంతో కమలం పార్టీ పావులు కదిపిందని విశ్లేషకులు చెబుతున్నారు. షిండేతోపాటు ఆయన వర్గానికి చెందిన మరో 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ మేరకు డీల్ కుదుర్చుకొన్నట్టు పేర్కొంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భయం
ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత షిండే-బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ నేపథ్యంలో ఇది రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన బీజేపీలో కనిపిస్తున్నది. ఇదే సమయంలో షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనున్నదనే ప్రచారం నేపథ్యంలో.. షిండేను పక్కనపెట్టేందుకు బీజేపీ నిర్ణయించుకొన్నదని తెలుస్తున్నది. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిణామాలు ఇవే సూచిస్తున్నాయని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని 48 ఎంపీ స్థానాలకు గానూ 45కు పైగా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొన్నదని, అయితే షిండే సీఎం కుర్చీలో కొనసాగితే ఇది సాధ్యం కాదని ఆ పార్టీ భావిస్తున్నదని పేర్కొన్నారు. షిండేను సీఎంగా చేసే సమయంలో బీజేపీ మరాఠా కార్డు ప్రయోగించింది. అజిత్ పవార్ కూడా మరాఠా నేతనే కావడం గమనార్హం.
అజిత్ పవార్ వెంట దాదాపు 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాజ్‌భవన్‌కు ఓ లేఖ సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. షిండేతో పాటు 16 మంది ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే. అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనేది బీజేపీ యోచన. ఒక వేళ షిండే పూర్తిగా మద్దతు ఉపసంహరించుకొన్నా.. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో అజిత్ పవార్ వర్గం(40), స్వతంత్ర ఎమ్మెల్యేల(10)తో కలిసి బీజేపీ(105) ప్రభుత్వాన్ని కొనసాగించొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫైనల్ డీల్ కుదిరాకే
గతంలో కూడా అజిత్ పవార్ ఇదేవిధంగా తిరుగుబాటు చేశారని, అయితే ఈ సారి బీజేపీతో డీల్ ఫైనల్ అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. త్వరలో సీఎంగా షిండే స్థానంలో అజిత్ వస్తారని, ఈ మేరకు డీల్ సెట్ అయిందని శివసేన (యూబీటీ) అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై త్వరలో అనర్హత వేటు పడనున్నదని, ఆ తర్వాత అజిత్ పవార్‌కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారని పేర్కొన్నది. బీజేపీ అజిత్ పవార్‌కు సీఎం పోస్టు హామీ ఇచ్చిందని, ఆ మేరకు తనకు సమాచారం ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ వెల్లడించారు. సోమవారం ఆయన కరాడ్‌లో మాట్లాడుతూ స్పీకర్ సాయంతో షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ద్వారా షిండేను పక్కనపెట్టేందుకు బీజేపీ ప్లాన్ వేసిందని పేర్కొన్నారు. షిండే త్వరలో సీఎం పోస్టు కోల్పోతారని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు.