Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాష్ర్టాల్లో అసమర్థ పాలన, అంతర్గత కుమ్ములాటలు, అనాలోచిత నిర్ణయాలు వెరసి కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో పెద్దన్నగా చెప్పుకొంటున్న కాంగ్రెస్ తీరుపై ఆ కూటమి పక్షాలే బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి. మూడు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. వీటన్నింటినీ విశ్లేషిస్తే.. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతున్నదని అర్థమవుతున్నది. దీన్ని ధ్రువపరుస్తూ.. గత లోక్‌సభ ఎన్నికల్లో సెంచరీకి చేరువగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు పెడితే ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదని తేటతెల్లమైంది. ఈ మేరకు ఇండియా టుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ నేషన్ (ఎంవోటీఎన్) పేరిట నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 78 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చిచెప్పింది. నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన సీట్లు 99తో పోలిస్తే, ఇప్పుడు ఆ పార్టీకి ఏకంగా 21 స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 21.5 శాతం మేర ఓట్లు రాగా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ పార్టీకి ఓటుబ్యాంకు 1.5 శాతం మేర తగ్గి, 20 శాతం మేర మాత్రమే ఓట్లు రావొచ్చని సర్వేలో తేలింది. ఇదే సమయంలో బీజేపీకి 3 శాతం మేర ఓటు షేరు పెరుగొచ్చని అభిప్రాయపడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సీట్లు కూడా భారీగా తగ్గిపోనున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు సాధించిన ఇండియా కూటమి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44 సీట్లు తగ్గి, 188 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోల్తాపడింది. ఢిల్లీలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ జీరో సీట్లు సాధించడమూ తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రజాదరణ కూడా అంతంతే అని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. దేశంలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో 62.1 శాతంతో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా స్టాలిన్(తమిళనాడు), హిమంత బిశ్వ శర్మ(అస్సాం), భూపేంద్రభాయ్ పటేల్(గుజరాత్), చంద్రబాబు నాయుడు(ఏపీ), మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), పేమా ఖండూ(అరుణాచల్ ప్రదేశ్), మాణిక్ సాహా(త్రిపుర) నిలిచారు. వీరందరికీ 40 శాతం కంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్‌కు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య(కర్ణాటక), సుఖ్విందర్ సింగ్ సుఖు(హిమాచల్ ప్రదేశ్)కు 40 శాతం ప్రజాదరణ కూడా దక్కలేదని ఈ సర్వేలో తేలింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ రాష్ర్టాల్లోనూ ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారెంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. ఏడాది గడిచినప్పటికీ ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయలేదు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కి.. రాష్ట్రంలో కబ్జాలు, శాంతిభద్రత సమస్యలు పెచ్చరిల్లుతున్నాయి. పొరుగురాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. ఐదు గ్యారెంటీలను అమలు చేయలేక అక్కడి సిద్ధరామయ్య సర్కారు ఆపసోపాలు పడుతున్నది. ఒకవైపు స్కామ్‌లు మరోవైపు ఛార్జీల పెంపుతో కన్నడ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక, కాంగ్రెస్ పాలనలో హిమాచల్ ఏకంగా దివాలా అంచుకు చేరడం తెలిసిందే.