శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ59(PSLV-C59) ప్రయోగం వాయిదా పడింది.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ నింగికి ఎగరాల్సిన ప్రోబా3 స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం సాయంత్రం 4.12 నిమిషాలకు ప్రయోగం ఉంటుందని ఇస్రో చెప్పింది. కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టించడం ద్వారా భానుడి గుట్టు విప్పేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 మిషన్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపుతున్నది. నిజానికి ఇవాళ సాయంత్రం 4.06 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.
Due to an anomaly detected in PROBA-3 spacecraft PSLV-C59/PROBA-3 launch rescheduled to tomorrow at 16:12 hours.
— ISRO (@isro) December 4, 2024
ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్) ఉన్నాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడతారు. కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడమే ప్రోబా-3 లక్ష్యం. ఆ రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరించనున్నాయి.