కోల్‌కతా, ఏప్రిల్ 12: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. పలు జిల్లాల్లో ఓ వర్గం ఇండ్లను దుండగులు, నిరసనకారులు టార్గెట్ చేసున్నట్టు తెలిసింది. శనివారం జాఫ్రాబాద్లో కొంతమంది దుండగులు, ఓ ఇంట్లోకి చొరబడి తండ్రి, కొడుకులపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా పోలీస్ అధికారి తెలిపారు. ధూలియాన్లో బుల్లెట్ గాయాలతో ఓ వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్‌లో పోలీసులు దాదాపు 110మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద ‘వక్ఫ్ సవరణ చట్టాన్ని’ పశ్చిమ బెంగాల్లో అమలు జేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రకటించారు. అన్ని మతాలకు చెందినవారు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలనే డిమాండ్‌తో త్రిపురలోని ఉనకోటి జిల్లాలో శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కుబ్జర్ ప్రాంతంలో నిరసనకారుల దాడిలో పోలీసు అధికారి సహా 18 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.