కోల్‌కతా: లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు బెయిల్‌పై కోల్‌కతాలో నిరసనలు వెల్లువెత్తాయి. (Protests in Kolkata) బాధిత ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, పలు వైద్య సంఘాలు, రాజకీయ పార్టీలు శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ ఏం ప్లాన్ చేస్తుందో మాకు తెలియదు. అయినప్పటికీ మేం ఆశ కోల్పోవడం లేదు. న్యాయం కోసం చివరి వరకు పోరాడుతాం. న్యాయ పోరాటం, వీధుల్లో పోరాటం కొనసాగుతాయి’ అని బాధితురాలి తండ్రి అన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (డబ్ల్యూబీజేడీఎఫ్) శనివారం మధ్యాహ్నం కరుణామోయి నుంచి సాల్ట్ లేక్‌లోని సీబీఐ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. సందీప్ ఘోష్‌కు బెయిల్ మంజూరు చేయడంపై జూనియర్ డాక్టర్లు మండిపడ్డారు. ‘ఇవాళ ఘోష్ వంటి వ్యక్తులకు బెయిల్ మంజూరు చేశారు. రేపు ప్రసిద్ధ వైద్య కాలేజీలో తిరిగి నియమిస్తారు. మాకు న్యాయం జరిగే వరకు రోడ్లపైనే ఉంటాం. సీబీఐపై మాకు నమ్మకం ఉంది, కానీ ఆ సంస్థ ఏం చేస్తోంది?’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సందీప్ ఘోష్‌కు బెయిల్ మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 90 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైందని ఆరోపించారు.