న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలో నిరసన తెలుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా తొలుత ప్రకటించింది. అయితే పార్లమెంట్ సమీపంలో రైతుల నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో నిరసన వేదికను జంతర్ మంతర్ వద్దకు మార్చినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ తెలిపారు. గురువారం సింఘు సరిహద్దు ప్రాంతం నుంచి నాలుగైదు బస్సుల్లో 200 మందికిపైగా రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటారని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు జంతర్ మంతర్ వద్ద రైతుల నిరసన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.