Jains Protest | జార్ఖండ్‌లో ఉన్న జైన సమ్మేద్ శిఖరాన్ని పర్యాటక క్షేత్రంగా ప్రకటించడం పట్ల జైన సమాజం ఆందోళన చేపట్టింది. జైనుల పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న ఈ శిఖరాన్ని పర్యటక ప్రాంతంగా ప్రకటిచడంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ఆదివారం ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో జైన సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్, ఇండియా గేట్ వద్ద పెద్ద సంఖ్యలో జైన సమాజం ప్రజలు గుమిగూడి కేంద్రం, జార్ఖండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది.
సమ్మేద్ శిఖరాన్ని జార్ఖండ్ ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ప్రకటించడం పట్ల జైన సమాజం తీవ్ర వ్యతిరేకిస్తున్నది. ఇది జైన సంఘాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆందోళనాకారులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై డిసెంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా జైన్ కమ్యూనిటీ ప్రజలు నిరసనలు చేస్తున్నారు. కాగా ఆదివారం ఆందోళనలను తీవ్రతరం చేశారు. 2019 లో కేంద్ర ప్రభుత్వం సమ్మేద్ శిఖర్ను పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. అనంతరం జిల్లా యంత్రాంగం సిఫారసు మేరకు జార్ఖండ్ ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది.

అదేవిధంగా గుజరాత్‌లోని పాలిటానాలో జైన దేవాలయాన్ని కూల్చివేసిన ఘటనపై కూడా జన్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే నిరసనల్లో పాలిటానాలో ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జైన సమాజం డిమాండ్ చేసింది. ఇలాఉండగా, జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. జైనుల పుణ్యక్షేత్రమైన సమ్మేద్ శిఖర్ను పర్యాటక ప్రాంతంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం విరమించుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. ఏ పుణ్యక్షేత్రాన్ని కూడా ఇలా పర్యాటక కేంద్రంగా మార్చకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ కోరింది.