Shanti Shree Dhulipudi | ఆమె మూలాలు తెలుగు రాష్ట్రాల్లో.. కానీ పుట్టింది రష్యాలో.. తన విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం చెన్నైలో.. ఇప్పుడామె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. అయితే జేఎన్‌యూ వీసీగా మహిళ ప్రొఫెసర్‌ను నియమించడం ఇదే తొలిసారి. మరి ఆమె వివరాలు ఏంటో తెలుసుకుందాం..
1962, జులై 15వ తేదీన రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో శాంతిశ్రీ ధూళిపూడి జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ధూళిపూడి ఆంజనేయులు(రిటైర్డ్ సివిల్ సర్వెంట్), తల్లి మూలమూడి ఆదిలక్ష్మి. రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓరియంటల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్లో ఆదిలక్ష్మి తమిళ్, తెలుగు ప్రొఫెసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. శాంతిశ్రీ తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్‌లో ఆనర్గళంగా మాట్లాడుతారు. కన్నడ, మలయాళం, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు.
1978లో మద్రాసులో పదో తరగతి పూర్తి చేశారు. పదిలో స్టేట్ ర్యాంకు వచ్చింది. మద్రాసులోనే 1980లో ఇంటర్ పూర్తి చేశారు. మద్రాసులోని ప్రెసిడెన్షీ కాలేజీ నుంచి బీఏ(హిస్టరీ, సోషల్ సైకాలజీ) లో ప్రథమ ర్యాంకు సాధించి, బంగారు పతకాన్ని అందుకున్నారు. ప్రెసిడెన్షీ కాలేజీ నుంచి మొత్తం 5 బంగారు పతకాలు, రెండు ప్రైజులను అందుకున్నారు శాంతి శ్రీ. 1985లో ప్రెసిడెన్షీ కాలేజీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పట్టా సాధించారు. న్యూఢిల్లీలోని జేఎన్‌యూ నుంచి ఎంఫీల్ డిగ్రీ అందుకున్నారు. జేఎన్‌యూ నుంచే పీహెచ్డీ పూర్తి చేసి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను కేంద్ర విద్యాశాఖ నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సావిత్రీభాయ్ పూలే యూనివర్సిటీ వీసీగా శాంతిశ్రీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే జేఎన్‌యూ వీసీగా మహిళ ప్రొఫెసర్‌ను నియమించడం ఇదే తొలిసారి. అయిదేళ్ల కాలపరిమితితో శాంతి శ్రీ నియామకం జరిగనట్లు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జేఎన్‌యూ తాత్కాలిక వీసీగా ఎం జగదీశ్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గత ఏడాది అయిదేళ్ల కాలపరిమితి ముగిసింది. అయితే యూజీసీ చైర్మెన్‌గా ఆయన్ను వారం క్రితం నియమించిన విషయం తెలిసిందే.