న్యూఢిల్లీ: వైద్య చికిత్సలో భాగంగా నోటి ద్వారా మందులను మింగడం వల్ల ఆహార నాళంలో వాపు, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆహార నాళం గొంతు నుంచి కడుపు వద్దకు చేరుకునే ప్రదేశంలో మాత్రలు, కాప్సూల్స్ చిక్కుకుపోతే ఈ సమస్య వస్తుందని తెలిపాయి. ఆ అధ్యయనాల ప్రకారం ఇక్కడ చిక్కుకున్న మాత్ర కరగడం ప్రారంభమైతే, దానిలోని పదార్థాలు నేరుగా సున్నితమైన కణజాలం పైకి విడుదలవుతాయి. ఆ రసాయనాల మంట వల్ల నొప్పి, మంట సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి అసాధారణమే అయినప్పటికీ, ఏటా ఒక లక్ష మందిలో 3.9 శాతం మందికి ఈ సమస్య వస్తుంది. ఈ కేసులు నమోదు కాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ సమస్యలు వైద్యుల జోక్యం లేకుండానే పరిష్కారమవడమే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మాత్రలు కడుపులోకి వెళ్లిపోయే విధంగా పూర్తిగా ఓ గ్లాసు నీటిని తాగాలి. దాదాపు 200 మిల్లీలీటర్ల నీటిని తాగాలి. ఖాళీ కడుపుతో మాత్ర వేసుకోవాలని వైద్యులు సూచిస్తే, ఆ విధంగానే తీసుకోవాలి. ఆ తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నిటారుగా ఉండాలి. దీనివల్ల మందు కడుపులో కరగడానికి వీలవుతుంది. పెద్ద మాత్రలను చిన్న ముక్కలుగా చేసి, వేసుకోవాలి. నీటిని పుష్కలంగా తాగాలి.