JNU Protests : ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా.. దేశ వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
దీంతో ఏబీవీపీ విభాగానికి చెందిన విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ నిరసనల్ని తప్పుబడుతూ వారు కూడా ఆందోళన చేశారు. ఈ క్రమంలో పలు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ అంశంపై జేఎన్ యూ మాజీ విద్యార్థి నాయకుడు వైభవ్ మీనా మాట్లాడుతూ ఉమర్, షర్జీల్ కు మద్దతుగా కొందరు విద్యార్థుల చేసిన నినాదాల్ని తప్పుబట్టారు. ఈ రకమైన పనులు సిగ్గుచేటని, భారత న్యాయ వ్యవస్థను కించపరచడమే అని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, అలాంటివారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలు చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థి నేతలు అక్కడే ఉన్నారని ఆరోపించారు.
ఢిల్లీ అల్లర్ల కేసులో ఆధారాలున్నాయి కాబట్టే, నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వలేదని ఆయన అన్నారు. మరో జేఎన్ యూ స్టూడెంట్ నేత అదితి మిశ్రా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ యూనివర్సిటీలో ఢిల్లీ దాడుల్ని ఖండిస్తూ, నిరసన తెలియజేస్తామన్నారు. ఇప్పుడు జరిగిన నిరసనలు సిద్ధాంతపరంగా సాధారణంగా జరిగే నిరసనలే అని, ప్రత్యేకించి ఏ వ్యక్తినీ, వ్యవస్థనూ ఉద్దేశించినవి కావని ఆమె అన్నారు.