లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా లఖింపూర్ ఖేరీ హింసలో నిందితుడిగా ఉన్నందున ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ తదితర కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీతోపాటు ఈ మౌన నిరసనలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తానని ‘రైతులకు న్యాయం’ పేరుతో ఆదివారం వారణాసిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను కాపాడేందుకు సీఎం యోగి ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.