లఖింపూర్ ఖీరీలో జరిగిన రైతు హత్యలను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మంత్రి కే తారకరామారావు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తాను దిగ్భ్రాంతికి గురయినట్టు పేర్కొన్నారు. రైతులను క్రూరంగా హత్యచేసిన నిందితులను త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతారని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
లక్నో, అక్టోబర్ 5: లఖింపూర్ ఖీరీలో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, అనంతర పరిణామాలతో ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతున్నది. ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు చేపట్టాలని యూపీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్పాండా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మంగళవారం ఓ లేఖ రాశారు. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, మంత్రి సన్నిహితులతో పాటు సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఆదివారం ఘటనలో మరణించిన నలుగురు రైతుల్లో ముగ్గురు రైతుల మృతదేహాలకు మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించారు. నాలుగో రైతు మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, పోలీసులు జరిపిన కాల్పుల్లోనే అతను మరణించాడని రైతు నేతలు ఆరోపించారు. ఢిల్లీలోని దవాఖానలో ఆ రైతు మృతదేహానికి తిరిగి పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు, లఖింపూర్ ఖీరీలో ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించినట్టు చెబుతున్న వీడియోను బీజేపీ నేత వరుణ్ గాంధీ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఘటనకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా నిరసన ప్రదర్శనలో ఉన్న రైతులపై రెండు వాహనాలు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తున్నది. ఇదిలాఉండగా బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని, ఘటనకు కారణమైన నిందితులను శిక్షించాలని పేర్కొంటూ ఢిల్లీ, పంజాబ్, యూపీవ్యాప్తంగా రైతులు, విపక్ష నేతలు నిరసనలకు దిగారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసనలు చేస్తున్న రైతులమీదకు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ఇతరులు మరణించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతుల మీదకు కారును తోలాడని రైతులు ఆరోపించగా, ఘటన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని మంత్రి తెలిపారు.
లఖింపూర్ ఖీరీ బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి పోలీసుల నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, ఆ పార్టీ నేత దీపేందర్ హుడాతో పాటు మరో పది మందిని యూపీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే కారణంగానే ప్రియాంకను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. అయితే, ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూపించకుండానే పోలీసులు 38 గంటలపాటు తనను నిర్బంధించారని, తన అరెస్టు చట్టవిరుద్ధమని ప్రియాంక ఆరోపించారు. తన తరుఫు న్యాయవాదిని కలువనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నట్టు పేర్కొన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం లక్నోకు వచ్చిన ప్రధాని మోదీ.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్బంధంలో ఉన్న ప్రియాంకపై డ్రోన్లతో నిఘా పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరోవైపు, పోలీసుల కస్టడీలో ఉన్న ప్రియాంకను పరామర్శించడానికి ప్రయాణమైన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌ను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఎయిర్‌పోర్టులోనే సీఎం బైఠాయించి నిరసనకు దిగారు.
బుధవారంలోగా.. రైతుల మరణాలకు కారణమైన కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేయకపోయినా, తమ నేత ప్రియాంక గాంధీని విడుదల చేయకపోయినా.. పంజాబ్ నుంచి లఖింపూర్ ఖీరీ వరకూ ర్యాలీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధూ పోలీసులను హెచ్చరించారు.
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా పక్కా పథకం ప్రకారమే లఖింపూర్ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఆశిష్ మిశ్రాను ఇంకా అరెస్ట్ చేయలేదు.