న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేపడుతుండగా అదే బాటలో ఆయన సోదరి, పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ప్రియాంక గాంధీ వచ్చే ఏడాదిలో రెండు నెలల పాటు మహిళా మోర్చా పేరిట యాత్ర చేపడతారని పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ అన్ని రాష్ట్రాల రాజధానుల మీదుగా ప్రియాంక యాత్ర సాగుతుందని చెప్పారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు రోజునే ప్రియాంక పాదయాత్ర ప్రారంభమవుతుండటం విశేషం. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో 85వ ప్లీనరీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం వర్కింగ్ కమిటీ స్ధానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్లీనరీ సెషన్, భారత్ జోడో యాత్రపై స్టీరింగ్ కమిటీలో విస్తృతంగా చర్చించారు.
ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని స్టీరింగ్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. యువత, మహిళ, రైతులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల నుంచి రాహుల్ యాత్రకు మద్దతు పెరుగుతున్నదని తెలిపింది. ఇక జనవరి 26 నుంచి హాథ్ సే హాథ్ జోడో పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.