న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమాస్ వార్ (Israel-Hamas War) నేపధ్యంలో గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపు ఇచ్చారు. గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి బయట అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ సేనల దాడిని ప్రస్తావిస్తూ ఈ ఘటన భయానకమని, సిగ్గుచేటని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. 5000 మంది చిన్నారులు సహా 10,000 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
వేలాది మంది తమ కుటుంబాలతో సంబంధాలు కోల్పోయారని, ఆస్పత్రులు, అంబులెన్స్‌లపైనా బాంబుల వర్షం కురిపించారని ట్విట్టర్ వేదికగా ఆమె రాసుకొచ్చారు. శరణార్ధ శిబిరాలనూ లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నారని, పాలస్తీనా మారణహోమానికి స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతినిధులమని చెప్పుకునే నేతలు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా అంతర్జాతీయ సమాజం పూనుకోవాలని ప్రియాంక గాంధీ పిలుపు ఇచ్చారు. కాగా గాజా సిటీలోని అల్ షిఫా ఆస్పత్రి వెలుపల అంబులెన్స్‌పై దాడికి తామే బాధ్యత వహిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ ఘటనలో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. హమాస్ ఈ అంబులెన్స్‌ను ఉపయోగించడం వలనే తాము దాన్ని టార్గెట్ చేశామని ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read More :
Free Ration | మరో ఐదేండ్లు ఉచిత రేషన్.. ఎన్నికల వేళ ప్రధాని మోదీ తాయిలాలు