Priyanka Gandhi Net Worth | కేరళ వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఆమె నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో ఆమె ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.12కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.4.24కోట్ల విలువ చేసే చరాస్తులు, రూ.7.74కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రియాంక గాంధీకి కూడా రూ.15 లక్షల 75 వేలు, రాబర్ట్ వాద్రాకు రూ.10,03,30,374 అప్పులు ఉన్నాయి. రూ.2.24కోట్లు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆమెకు మూడు ఖాతాలు ఉండగా.. అందులో రూ.3.61లక్షలకుపైగా డిపాజిట్లు ఉన్నాయి.
సెప్టెంబర్ 30 వరకు చేతిలో రూ.52వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. పీపీఎఫ్ ఖాతాలో రూ.17.38లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 59.83 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని.. వాటి విలువ రూ.29,55,581 ఉంటుందని చెప్పారు. అలాగే, 4.41 కిలోల ఆభరణాలు ఉన్నాయని.. ఇందులో 2.5 కిలోల బంగారం, దాని విలువ రూ.1.15కోట్లుపైగా ఉంటుందన్నారు. భర్త రాబర్ట్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన రూ.8లక్షల విలువైన హోండా సీఆర్వీ ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక ఢిల్లీలోని మోహ్రాలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఉందని.. ఫామ్‌హౌస్‌లో సగం వాటా ఉందని వివరించారు. వ్యవసాయ భూమి విలువ రూ.2.10కోట్లు ఉంటుందని.. అలాగే, సిమ్లాలో తన పేరుతో రూ.5.63కోట్ల నివాస భవనం ఉందని చెప్పారు. గతేడాది తన ఆదాయం రూ.46.39లక్షలు అని చెప్పారు. భర్త వాద్రా నికర ఆస్తుల రూ.65.54కోట్లుగా ప్రియాంక పేర్కొన్నారు. ఇందులో 37.9కోట్ల చరాస్తులు, రూ.27.64కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వివరించారు.