వయనాడ్: వయనాడ్ లోక్సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) దూసుకెళ్తున్నారు. ఓట్లు లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నరు. ఇప్పటివరకు ఆమెకు మొత్తం పోలైన ఓట్లలో 2.26 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో తన సమీప అభ్యర్థి సీపీఐకి చెందిన సత్యన్ మొకేరిపై లక్షా 64 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు 70 వేల ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడోస్థానానికే పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమె ప్రియాంకకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. ఆమెకు 43,352 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఆయన రికార్డును ప్రియాంక అధిగమించేలా దూసుకెళ్తున్నారు. ఉపఎన్నికలో వయనాడ్లో 9.52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు 3.5 లక్షల ఓట్లు మాత్రమే లెక్కించారు. మిగిలిన ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆమె ఆధిక్యం మరింత పెరుగనుంది.