Congress | బికినీ గర్ల్, మోడల్ అర్చనా గౌతమ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంపై విమర్శలు చెలరేగిన విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఇలాంటి ప్రశ్నలు కేవలం మహిళల విషయంలో ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. పురుషుల విషయంలో ఇలాంటి ప్రశ్నలను ఎందుకు వేయరని ప్రియాంక నిలదీశారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ వర్చువల్‌గా కార్యకర్తలతో సంభాషించారు. అర్చన గౌతమ్ అనేక సవాళ్లను ఎదుర్కొని, నిలబడ్డారని, ఇప్పుడు ఆమెను అందరూ గుర్తించే స్థాయిలో ఉన్నారన్నారు. మహిళలకు సేవ చేయడం, హస్తినాపురం అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారని ప్రియాంక పేర్కొన్నారు.
అర్చన గౌతమ్ విషయంలో కొందరు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ప్రియాంక దుయ్యబట్టారు. ఇలాంటివి కేవలం మహిళల విషయంలోనే చేస్తారని, పురుషుల విషయంలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. మోదీ వైవాహిక జీవితానికి సంబంధించి ఎందుకు ప్రశ్నించరని ప్రియాంక నిలదీశారు. ఎవర్ని, ఎప్పుడు వివాహం చేసుకున్నారని మోదీని కూడా అడగాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యర్థి అర్చన గౌతమ్ స్పందించారు. మహిళల విషయంలో నెగెటివ్‌గా ఆలోచించే వారికి, అభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచించే వారికి ప్రియాంక గాంధీ సరైన జవాబిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఫొటోలను ఏమాత్రం తొలగించేది లేదని అర్చన స్పష్టం చేశారు. మోడలింగ్, రాజకీయాలు రెండూ వేర్వేరని, రెంటినీ కలిపి చూడొద్దని అర్చన విజ్ఞప్తి చేశారు.