Priyanka Gandhi : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుతోంది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత పడిపోతోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీ సీఎం (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు.
బీహార్లో ఎన్నికల ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రియాంక.. దేశ రాజధానిలో కాలుష్య పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నాయకులందరూ కలిసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ భయంకర పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వాలని రాజకీయ నేతలను కోరారు.
ప్రతి ఏడాది ఢిల్లీ పౌరులపై ఈ విష వాయువులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు, పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులతోపాటు తాము కూడా ఈ విష వాయువునే పీల్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకుని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.