Akhilesh-Priyanka | కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రియాంకాగాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కలుసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే విమానంలో వారిద్దరూ కలుసుకున్నారు. కరోనా మహమ్మారి ఆంక్షలు, గైడ్లైన్స్ పాటిస్తూ.. ఇద్దరూఫేస్మాస్క్లు ధరించి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో పోస్టయింది.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లక్నో నుంచి బారాబంకీ వెళ్లేందుకు ప్రియాంక.. ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరారు. బారాబంకీ నుంచి రాష్ట్రవ్యాప్త యాత్రలను ప్రారంభించనున్నారు. ఇక అఖిలేశ్ యాదవ్.. ఢిల్లీలో పనులు ముగించుకుని లక్నోకు వెళ్లారు. ఇరువురు నేతలు కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్, బీజేపీపై నిత్యం విమర్శలు చేస్తున్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలకు, ఎస్పీ 47 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాలకు పోటీ చేసినా.. ఆ మేరకు విజయాలు సాధించడంలో విఫలమైంది. దీంతో అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. యూపీ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని, భవిష్యత్లో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికిప్పుడు ఇతర పార్టీలతో పొత్తుకు విముఖంగా ఉంది.