చండీగఢ్: ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య పథకమైన ఆయుష్మాన్ భారత్ సేవలను నిలిపివేస్తామని వందలాది ఆసుపత్రులు హెచ్చరించాయి. బీజేపీ పాలిత హర్యానాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని సుమారు 600 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. సీఎం నయాబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ను క్లియర్ చేయలేదు.
కాగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హర్యానా విభాగం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 8న సీఎం నయాబ్ సింగ్ సైనిని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద రోగులకు చికిత్స చేయడం నిలిపివేస్తాయని ఐఎంఏ హెచ్చరించింది. జనవరి 25న ఆయుష్మాన్ భారత్ హర్యానా హెల్త్ ప్రొటెక్షన్ అథారిటీకి ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది.
మరోవైపు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని దీనిపై స్పందించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం బకాయిల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఐఎంఏకు చెందిన డాక్టర్లతో తాను సమావేశమైనట్లు చెప్పారు. జనవరి 26న రూ.766 కోట్లను క్లియర్ చేసినట్లు వివరించారు. ఇంకా రూ.200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. మరో రెండు రోజుల్లో వీటిని కూడా చెల్లిస్తామని మీడియాతో అన్నారు.