న్యూఢిల్లీ: అధికారిక విధులను నిర్వరిస్తున్న ప్రభుత్వ అధికారిని క్రిమినల్ కేసులో విచారించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారిణి సునేటి తొతేజాకు వ్యతిరేకంగా నమోదైన క్రిమినల్ నేరారోపణల్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీఆర్పీసీలోని సెక్షన్-197 కింద ముందస్తు అనుమతి తీసుకోకపోవటం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తప్పుగా పేర్కొన్నది. మంగళవారం ఓ క్రిమినల్ కేసులో విచారణ జరుపుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు ప్రభుత్వ అధికారిక విధులు నిర్వర్తించే అధికారిగా ఉన్నాడా? లేదా? అన్నది చూడాలి. సమాధానం సానుకూలంగా ఉంటే, వారిపై ఉన్న కేసులను కోర్టులో విచారించడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి’ అని ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా దాఖలైన చార్జ్‌షీట్, సమన్లను రద్దు చేయాలంటూ తొతేజా హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.