(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలకు సవాలక్ష నిబంధనలు పెడుతూ, ఏటికేడు నిధుల్లో కోత పెడుతున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రధాని మోదీకి ప్రచారాన్ని కల్పించడం కోసం మాత్రం కోట్లాది రూపాయలను కుమ్మరిస్తున్నది. ప్రధాని మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమమే ఇందుకు రుజువు. ఏడేండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమం కోసం నిధులను ఏకంగా ఐదింతలు పెంచడం విమర్శలకు తావిస్తున్నది.
ఏటికేడు పెంపు
విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు అంటూ 2018లో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోదీ స్వయంగా విద్యార్థులతో మాట్లాడుతారు. అయితే, విద్యార్థులకు పరీక్షల భయాన్ని పోగొట్టడమేమోగానీ, ప్రధాని మోదీకి మాత్రం ఈ కార్యక్రమం ఉచిత ప్రచారం కల్పించేదిగా, ఓ పీఆర్ స్టంట్‌గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కార్యక్రమానికి విడుదల చేస్తున్న నిధులపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. 2018లో ఈ కార్యక్రమానికి రూ. 3.67 కోట్ల నిధులను వెచ్చిస్తే.. 2025నాటికి ఈ కేటాయింపులు రూ. 18.82 కోట్లకు చేరాయి. అంటే ఏడేండ్ల వ్యవధిలో కేటాయింపులు 522 శాతం పెరిగాయి. ఈ మేరకు ‘ది వైర్’ ఓ కథనంలో వెల్లడించింది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం కింద కేవలం రెండేండ్లలోనే దేశవ్యాప్తంగా 1,111 సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. దీని కోసం ఏకంగా రూ. 2.49 కోట్లను వెచ్చించడం విమర్శలకు దారితీస్తున్నది. అన్నింటికీ మించి 2021లో కరోనా సంక్షోభ సమయంలో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. డిజిటల్ మాధ్యమంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కూడా రూ. 6 కోట్లు కేటాయించినట్టు పీఐబీనే చెప్పింది. దీంతో మోదీ ప్రచార కార్యక్రమం నిధుల దుర్వినియోగానికి రాజమార్గంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థులకు మొండి చేయి
‘పరీక్షా పే చర్చ’ పేరిట ఒకవైపు పీఆర్ స్టంట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రం.. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫెలోషిప్‌లకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తున్నది. జాతీయ అర్హత పరీక్ష (నెట్) కాకుండా, వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఫిల్, పీహెచ్డీ సీట్లలో చేరే విద్యార్థులకు యూజీసీ ద్వారా ఫెలోషిప్లను కేంద్రం రద్దు చేసింది. దీంతో పరిశోధనల కోసం ప్రతీనెలా అందే రూ. 25 వేల మొత్తానికి విద్యార్థులు దూరమయ్యారు. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్)ను కూడా రద్దు చేస్తున్నట్టు నిరుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్ అందజేయగా, 2020-21 నాటికి 1,075 మందికి కుదించింది. ఇచ్చే నిధులను కూడా రూ.100 కోట్ల నుంచి రూ.74 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు ఆ ఫెలోషిప్నే ఎత్తేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఇకనుంచి స్కాలర్షిప్స్ ఇస్తామని.. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ పేరిట ఇస్తున్న వాటిని నిలిపేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున 1-8 తరగతుల విద్యార్థులకు ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మెరిట్ స్కాలర్షిప్, పీఎం ఇన్నోవేటివ్ లర్నింగ్ ప్రోగ్రామ్‌కు అవసరమైన నిధులను 23.2 శాతం తగ్గించింది. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌ను 2021 నుంచి సస్పెండ్ చేసింది. విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలనూ కేంద్రం నిలిపేసింది.