న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న ప్రారంభమవుతుందని, దీనికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడావిచ్చేస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించే బాధ్యత భారత్‌దని, అయితే తామే ఈసారి దానిని నిర్వహిస్తామంటూ అమెరికా చేసిన అభ్యర్థన మేరకు ఈ సమావేశాన్ని 2025లో నిర్వహించడానికి భారత్ అంగీకరించినట్టు ఆ శాఖ ప్రతినిధి చెప్పారు. పర్యటనలో భాగంగా 22న న్యూయార్క్‌లో మోదీ స్థానిక భారతీయులను కలిసి మాట్లాడుతారు. 23న సమావేశం ఆఖరి రోజు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్’పై ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ప్రధాని పలు యూఎస్ కంపెనీల సీఈవోలతో సమావేశమై సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించనున్నారు.