న్యూఢిల్లీ : బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో త్వరలో మరో చీలిక ఏర్పడనున్నదని మోదీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ పట్ల దాని మిత్రపక్షాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ని విమర్శిస్తుందని, ఓట్ చోరీ వంటి నిరాధార అంశాల గురించి మోసపూరిత ఫిర్యాదులు చేస్తుందని అన్నారు. ప్రజలను మత, కుల ప్రాతిపదికన చీలుస్తున్న కాంగ్రెస్‌కు దేశం పట్ల సానుకూల దృక్పథం లేదని ఆయన ఆరోపించారు.
వాస్తవం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా మారిపోయింది. ఈ అజెండాతోనే కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తోంది. ఈ కారణంగానే ఆ పార్టీలో కొత్త గ్రూపు పుట్టుకొస్తోంది. అది ప్రతికూల రాజకీయాల కన్నా అత్యంత దుర్మార్గమైనది అని ప్రధాని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో మరో భారీ చీలిక ఉంటుందని తాను అనుమానిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన ప్రతికూల రాజకీయాలలో తమను కూడా ముంచేస్తోందని కాంగ్రెస్ మిత్రులు, మద్దతుదారులు అర్థం చేసుకోవడం ప్రారంభించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తోపాటు దాని మిత్రులు కూడా మునిగిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.