న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్ కొని, ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియంలో 14 మంది ప్రధానుల చరిత్ర వుంటుంది. వాళ్లు దేశాన్ని ఎలా నడిపారు? లాంటి విషయాలు కూడా ఇందులో వుంటాయి. ఇక భారత మొదటి ప్రశాని నెహ్రూ జీవితం, ఆయన దేశానికి చేసిన సేవలకు సంబంధించి ఓ డిస్ప్లేను కూడా వుంచారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెహ్రూకు వచ్చిన బహుమతులను కూడా ఈ మ్యూజియంలో వుంచారు. దేశ ప్రధానులు ,వారి జీవితాలు, దేశం కోసం వారు పడ్డ శ్రమ… ఇలా మొత్తం కూడా ఇందులో పొందుపరిచారు.
ఈ మ్యూజియంలో రెండు బ్లాకులు వుంటాయి. అందులో మొదటిది తీన్మూర్తి భవన్. రెండో బ్లాక్ పూర్తిగా కొత్త బ్లాక్. 15 వేల 600 చదరపు మీటర్ల కంటే ఎక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.అభివృద్ధి చెందుతున్న భారత్ ను ప్రేరణగా తీసుకొని, ఈ భవన నిర్మాణం ఉంటుందని తెలిపారు. అయితే ఇంతటి మ్యూజియం నిర్మించే సమయంలో ఒక్క చెట్టును కూడా నరికేయలేదని కూడా అధికారులు పేర్కొన్నారు.
ఇక మ్యూజియానికి సంబంధించిన సమాచారం గానీ, ఫొటోలు గానీ, ఇతరత్ర సమాచార్ని కూడా జాగ్రత్తగా సేకరించారు. ప్రసార భారతి, దూరదర్శన్, ఫిల్మ్ విభాగాలు, పార్లమెంట్ టీవీ, రక్షణ శాఖ, భారత్ మీడియాతో పాటు విదేశీ మీడియా సంస్థలు, విదేశీయ సమాచార ఏజెన్సీలతో పాటు వివిధ లైబ్రరీల నుంచి వీటిని సేకరించారు.