PM Modi | న్యూఢిల్లీ, మే 8: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత, నిర్వహణా సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ప్రధాని నిరంతరం అప్రమత్తంగా, స్పష్టమైన సమాచారంతో ఉండాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
సివిల్ డిఫెన్స్ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారాన్ని, తప్పుడు వార్తలను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టడం, కీలకమైన మౌలిక సౌకర్యాల భద్రత కల్పించేలా చూడడం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ర్టాల అధికారులు, క్షేత్ర స్థాయి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రిత్వ శాఖలకు ప్రధాని సూచించారు. జాతీయ భద్రతకు సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ సంసిద్ధతను సమావేశంలో సమీక్షించినట్లు ఆ ప్రకటన తెలిపింది.