PM Modi : కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకే (DMK) తో కాంగ్రెస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డీఎంకేతో పొత్తువల్లే కాంగ్రెస్ అనేకసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని గుర్తుచేశారు. 2014కు ముందు పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించిందని అన్నారు.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో స్టాలిన్ పార్టీని వదిలి టీవీకేతో చేతులు కలిపిందని ప్రధాని విమర్శించారు. అధికారంపై ఉన్న దురాశతో దొరికిన తొలి అవకాశంలోనే మిత్రుడికి వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి దారుణానికి అయినా ఒడిగడుతుందని విమర్శించారు. డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ చేసింది మిత్రద్రోహమని అన్నారు.
కర్ణాటకలో సుపరిపాలన అందించడంలోనూ కాంగ్రెస్ విఫలమైందని మోదీ మండిపడ్డారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులుగా.. అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఎంతకాలం కొనసాగుతారో, మరో వ్యక్తికి అవకాశం లభిస్తుందో లేదో కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించలేకపోతోందని ఎద్దేవా చేశారు.
సరైన ఎజెండా లేకపోవడం వల్లే కాంగ్రెస్కు ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని ప్రధాని చెప్పారు. దేశప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోతుందని అన్నారు. సురక్షిత పాలన, అభివృద్ధి కోసం దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని విమర్శించారు. అందుకే తాజా ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, అస్సాం ప్రజలు కాషాయ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. భవిష్యత్తులో కర్ణాటకలోనూ బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.