న్యూఢిల్లీ/సూరత్, డిసెంబర్ 17: సూరత్‌లో ఆదివారం ప్రారంభమైన ‘డైమండ్ బోర్స్’ (ఎస్డీబీ) భవనమిది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవన సముదాయంగా ఇది నిలిచింది. వజ్రాల పరిశ్రమకు వెన్నుదన్నుగా 67లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఇది తీవ్రమైన అంశమేనని పేర్కొన్న ఆయన దీనిపై రాద్ధాంతం అనవసరమని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఆందోళనకరమని, తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. హిందీ పత్రిక దైనిక్ భాస్కర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ పార్లమెంట్ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని పేర్కొన్నారు. దీని వెనుక ఉన్నవారి మూలాలు, వారి ఉద్దేశాన్ని తేల్చాలని అన్నారు.
సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రారంభించిన మోదీ
గుజరాత్లో ఆదివారం పర్యటించిన ప్రధాని మోదీ సూరత్‌లో నిర్మించిన సూరత్ డైమండ్ బోర్స్(ఎస్డీబీ) భవనాన్ని ప్రారంభించారు. వజ్రాల వ్యాపార కార్యాకలాపాలకు ఉద్దేశించిన ఈ బిల్డింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా నిలిచింది. ఈ కాంప్లెక్స్‌ను దాదాపు 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.