ముంబై : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) నాగపూర్ శాశ్వత క్యాంపస్‌ను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సోమవారం ప్రారంభించారు. విద్యాసంస్ధలు కేవలం బోధనా ప్రదేశాలు కాదని, ప్రతి వ్యక్తిలో దాగున్న నైపుణ్యాలను వెలికితీసి పదునుపెడతాయని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు.
నవ్యత, వ్యాపార నాయకత్వం మన జీవితాలను సరళతరం చేయడమే కాకుండా ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ఐఐఎం నాగపూర్‌లో నెలకొన్న వాతావరణంతో విద్యార్ధులను ఉద్యోగాలను సృష్టించే వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఐఎం నూతన క్యాంపస్ భవిష్యత్ నేతలకు మెరుగైన అవకాశాలు కల్పించడం సహా వారిని దీటైన నేతలుగా మలుస్తుందని అన్నారు. ఇక్కడి యువ మిత్రులు వారి కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు దేశ ముఖచిత్రాన్ని మార్చివేస్తారని ఆకాంక్షించారు. మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలని సూచించారు.