న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం దేశంలోని 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా ఈ వివరాలను తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ మన్మోహన్‌ను నియమించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజీవ్ షక్దర్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమించారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది.
కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ నితిన్ మధుకర్ జామ్దార్ను, జస్టిస్ తషి రబ్స్టన్ను జమ్ము కశ్మీర్, లడఖ్ హైకోర్టు సీజేగా నియమించారు. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్‌కు మద్రాస్ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్ర రావును జార్ఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు.