హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉప రాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే అనూహ్య పరిస్థితుల్లో సోమవారం ఆయన రాజీనామా చేయడంపై ప్రతిపక్షాలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వపక్షం బీజేపీతో పొసగకపోవడం వల్లే ధన్‌ఖడ్ ఇలా గంటల వ్యవధిలోనే రాజీనామా నిర్ణయం తీసుకొన్నారని చెప్తున్నారు. ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు.
బీహార్‌లో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయూ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఉప రాష్ట్రపతిగా చేయడంలో భాగంగానే ధన్‌ఖడ్ రాజీనామా తెరమీదకు తీసుకువచ్చినట్టు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా నితీశ్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్ మంత్రి, బీజేపీ నేత నీరజ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించడం, నితీశ్ ఉప రాష్ట్రపతిగా ఉంటే రాష్ర్టానికి మంచి జరుగుతుందని బీజేపీ మంత్రి ప్రేమ్‌కుమార్, బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలాఉండగా.. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే నితీశ్‌ను ఉప రాష్ట్రపతిగా చేయడానికి వీలుగా ధన్‌ఖడ్‌తో బీజేపీ రాజీనామా చేయించిందని, ఇది కుట్రేనని ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది.
పదవీవిరమణకు సంబంధించి జూలై 10న ధన్‌ఖడ్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. 2027 ఆగస్టులో సరైన సమయంలో తాను రిటైర్ అవుతానని ధన్‌ఖడ్ అన్నారు. అయితే అది దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పది రోజులు తిరక్కముందే రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
పదవిలో ఉండగా ఉప రాష్ట్రపతి రాజీనామా చేసినా, మరణించినా, ఆయన్ని తొలగించినా సాధ్యమైనంత త్వరగా తదుపరి ఉప రాష్ట్రపతిని నియమించాలని రాజ్యాంగంలోని 68వ అధికరణంలోని క్లాజ్ 2 పేర్కొంటున్నది. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్యక్తి మిగిలిన కాలానికి కాకుండా పదవిని చేపట్టిన రోజు నుంచి మొత్తం ఐదేండ్లు ఆ పదవిలో కొనసాగుతారు.
రాజీనామాకు ముందు సోమవారం అధికార బీజేపీకి సానుకూలంగా ఉన్న ధన్‌ఖడ్ వైఖరి మధ్యాహ్నం తర్వాత భిన్నంగా మారినట్టు ‘ది ఫెడరల్’ ఇంగ్లిష్ పత్రిక పొలిటికల్ ఎడిటర్ పునీత్ నికోలస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ మినహా మరే ఇతర చర్చకు తాము ఒప్పుకోబోమంటూ రూల్ 267 కింద ప్రతిపక్ష నేతలు ఇచ్చిన మోషన్‌ను ధన్‌ఖడ్ పక్కనబెట్టారని యాదవ్ అన్నారు. ఇదే సమయంలో రూల్ 167 కింద బీజేపీ సభ్యులు ఇచ్చిన మోషన్‌ను ఆయన అంగీకరించినట్టు చెప్పారు. మధ్యాహ్నం వర్మ అభిశంసన కోరుతూ విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులను అంగీకరిస్తూ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకొన్నారని యాదవ్ అభిప్రాయపడ్డారు. కాగా, పదకొండేండ్ల మోదీ నాయకత్వానికి ధన్‌ఖడ్ రాజీనామా ‘బ్లడ్ ఆన్ కార్పెట్’ (ధిక్కారం) లాంటిదేనని ‘ది ఫెడరల్’ సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కే సహాయ్ అభివర్ణించారు.
ఉప రాష్ట్రపతి రేసులో జేడీయూ నేత, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ పేరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారని పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాక్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టే బృందంలో శశిథరూర్‌ను కేంద్రం ఎంపిక చేయడం తెలిసిందే.
ధన్‌ఖడ్ రాజీనామాకు ఆరోగ్య సమస్యలు అసలైన కారణం కాకపోవచ్చని, ఈ నిర్ణయానికి లోతైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. బీఏసీ రెండో దఫా భేటీకి జేపీ నడ్డా, రిజిజు హాజరుకాకపోవడంతో ధన్‌ఖడ్ ఆగ్రహంతో ఉన్నారని, ఈక్రమంలోనే సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారని గుర్తు చేశారు. అయితే, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ధన్‌ఖడ్ రాజీనామాకు దారితీసిందని మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.