న్యూఢిల్లీ : అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) కింద నమోదైన ప్రతి కేసులో ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని, అది నిందితుడికి కల్పించిన హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీఏ కింద నమోదయ్యే కేసులతో సహా కొన్ని ప్రత్యేక కేసులలో ప్రాథమిక దర్యాప్తు వాంఛనీయం అయినప్పటికీ క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ఇది ముందస్తు అవసరం లేదా తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 17న వెలువరించిన ఓ కేసు తీర్పునకు సంబంధించి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది.
ప్రాథమిక దర్యాప్తు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం తమకు అందిన సమాచారంలోని నిజానిజాలను నిర్ధారించుకోవడం కోసం కాదని, అది చట్టప్రకారం నేరమా కాదా అని తేల్చుకోవడం కోసమేనని ధర్మాసనం తెలిపింది. తమకు సమాచారం అందచేసిన వ్యక్తి ఉన్నత అధికారి అయిన పక్షంలో ప్రాథమిక దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. 2024 మార్చిలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పీసీ చట్టం కింద నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ ప్రభుత్వ ఉద్యోగిపై కర్ణాటక లోకాయుక్త పోలీసు స్టేషన్లో దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.