గౌహతి: సెంట్రల్ అస్సాంలోని నగావ్ జిల్లాలో గురువారం దారుణం జరిగిన విషయం తెలిసిందే. 18 ఏనుగులు ఒకేసారి మృతిచెందిన ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. భారీ మూగజీవాలు ఎలా ఒకేసారి ప్రాణం విడిచాయన్నదే అంతు చిక్కని ప్రశ్న. గజరాజుల మరణంపై అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. అయితే ఇవాళ ఆ ఏనుగులు మృతిచెందిన ప్రాంతాన్ని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి పరిమల్ శుక్లబైద్య విజిట్ చేశారు. ఏనుగులు మృతిచెందిన బాముని పర్వతాలకు వెళ్లిన మంత్రి.. అక్కడ ఆ జీవాలకు నివాళి అర్పించారు. అటవీశాఖ అధికారితో పాటు కొందరు వెటర్నరీ బృందం .. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతుందన్నారు. మూడు రోజుల్లోనే ప్రిలిమినరీ ఇంక్వైరీ నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణతో కూడిన నివేదికను మరో 15 రోజుల్లోగా సమర్పించాలన్నారు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన 18 ఏనుగుల మృతికి అసలైన కారణాలను అన్వేషిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
(2/2)The preliminary report of enquiry has been asked to be submitted within 3 days & a detailed investigation report within 15 days. We will unravel the exact reason behind their tragic death soon. pic.twitter.com/5qqz9Izzhb
— Parimal Suklabaidya (@ParimalSuklaba1) May 14, 2021
బాముని పర్వత శ్రేణుల్లో 18 ఏనుగులు అనుమానాస్పద రీతిలో మత్యువాతపడ్డాయి. బరహంపూర్ పోలీసుల ప్రకారం.. నాలుగు ఏనుగులు పర్వత శ్రేణుల మొదటల్లో.. మిగితా ఏనుగుల మృతదేహాలన్నీ పర్వతశిఖరాలపై పడి ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం తమకు ఏనుగుల మృతిపై సమాచారం అందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. స్థానిక గ్రామస్థులు తమకు ఆ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆ ఏనుగులు ఎలా మృతిచెందాయో అధికారులు తేల్చలేకపోయారు. మెరుపులు, పిడుగు పాటు వల్ల ఏనుగులు మృతిచెంది ఉంటాయని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటనా ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఇవాళ పోస్టు మార్టమ్ ప్రారంభించారు. పోస్టు మార్టమ్ చేయకుండా కేవలం పిడుగుల వల్ల ఏనుగులు మృతిచెందినట్లు తేల్చలేమని నిపుణులు తెలిపారు. పోస్టుమార్టమ్లోనే మొత్తం వివరాలు బయటపడుతాయని తెలుస్తోంది. కానీ ప్రాథమికంగా ఈ ఘటన మాత్రం పిడుగుల వల్ల కాదు అని ఏనుగుల నిపుణుడు విజయానంద్ చౌదరీ తెలిపారు. విష ప్రయోగం వల్లే ఆ ఏనుగులు మృతిచెంది ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇది విషప్రయోగమే అయితే ఆ మూగ జీవాలను ఎందుకు టార్గెట్ చేశారో తెలియాల్సి ఉంటుంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో దేశంలో ఏనుగులు మృతిచెందిన ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి.