కోయంబత్తూర్, ఫిబ్రవరి 7: గర్భిణిపై లైంగిక దాడికి యత్నించిన ఓ దుండగుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా రైలు నుంచి తోసేశాడు. గురువారం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలి కాలు, చేతులకు, తలకు గాయాలయ్యాయి. రైల్వే అధికారులు ఆమెను వెల్లూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితుడు హేమరాజ్‌ను అరెస్టు చేసినట్టు తెలిసింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు రేవతి(36) ఆంధప్రదేశ్ చిత్తూరులోని తల్లి ఇంటికి వెళ్లేందుకు తిరుప్పూర్‌లో కోయంబత్తూర్-తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు జోలార్‌పెట్టాయి స్టేషన్‌కు చేరుకోగానే మహిళల కోచ్‌లో ఆమె పక్కన కూర్చున్న ఆడవాళ్లందరూ దిగిపోయారు. రైలు కదులుతుండగా రేవతి ఉన్న బోగీలోకి ఎక్కిన హేమరాజ్(27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. నిందితుడు వెంటనే ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు.