ముంబై: గర్భవతి అయిన అటవీశాఖకు చెందిన మహిళా ఫారెస్ట్ రేంజర్పై మాజీ సర్పంచ్ దంపతులు దాడి చేశారు. ఆమె జట్టుపట్టుకుని లాగి మరీ కొట్టారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పల్సవాడే మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారామ్ జాంకర్, స్థానిక అటవీ కమిటీలో సభ్యుడు. అయితే అటవీశాఖ మహిళా రేంజర్ తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలతో మరోచోట పని చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం ఆమెకు ఫోన్ చేసి దీనిపై బెదిరించాడు.
కాగా, బుధవారం ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో కూలీలతో పని చేయిస్తున్న అటవీశాఖ మహిళా రేంజర్, ఆమె భర్తపై గంగారామ్, ఆయన భార్య దాడి చేశారు. తొలుత గంగారామ్ భార్య వారిద్దరిపై చెప్పుతో దాడి చేసింది. మహిళా రేంజర్ ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన గంగారామ్, మూడు నెలల గర్భిణీ అయిన ఆమె జుట్టుపట్టుకుని ఈడ్చి కిందపడేసి కాలితో తన్నాడు.
మరోవైపు బాధితురాలి భర్త, మరికొందరు ఈ ఘటనను తమ మొబైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. దాడి చేసిన మాజీ సర్పంచ్ దంపతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఘటనను ఖండించారు. నిందితులు అరెస్ట్ అయ్యారని, చట్టంప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు.
The accused has been arrested this morning and will face the law at its strictest. Such acts will not be tolerated. https://t.co/04shu6ahiz
— Aaditya Thackeray (@AUThackeray) January 20, 2022