PM Modi : ఇవాళ తెల్లవారుజామున ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankar) ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి (Aims Hospital) కి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు.
జగదీప్ ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ఎక్స్‌లో ఆకాంక్షించారు. ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధన్కడ్ను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనను ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్ (CCU) లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు.
ధన్కడ్ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రధాని మోదీ కంటే ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.