పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పార్టీ జన్ సూరాజ్, బీహార్లో తొలిసారి పోటీకి సిద్ధమైంది. తరారీ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఆర్మీ మాజీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కృష్ణ సిన్హాను అభ్యర్థిగా బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇతర మాఫియాకు పర్యాయపదంగా మారిన తరారీ స్థానంలో ఆర్మీ స్టాఫ్ ఏకైక వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం గర్వకారణమని అన్నారు. వచ్చే నెలలో జరునున్న మరో మూడు స్థానాల ఉప ఎన్నికలకు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
కాగా, ఈ సందర్భంగా జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థి లెఫ్టినెంట్ జనరల్ సింగ్ మాట్లాడారు. అగ్నివీర్ పథకం పట్ల తాను సంతోషంగా లేనని అన్నారు. రెండేళ్ల కిందట దీనిని రూపొందించినప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. సొంత ప్రాంతమైన తరారీపై తనకున్న ప్రేమ వల్ల హాయిగా గడిచిపోతున్న జీవితాన్ని వదులుకున్నట్లు వివరించారు.
మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైన సీపీఐ(ఎంఎల్) నేత సుదామ ప్రసాద్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో భోజ్పూర్ జిల్లాలోని తరారీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.