పాట్నా: తన దార్శనికతపై ప్రజలకు నమ్మకం ఉంటే బీహార్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి 150కి పైగా స్థానాలు లభిస్తాయని, లేదంటే కనీసం 10 స్థానాల్లో అయినా గెలవలేమని జన్ సురాజ్ పార్టీ(జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమకు 150 కన్నా తక్కువ స్థానాలు వస్తే, ఓడిపోయినట్లేనని తెలిపారు. శనివారం ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నేతలు, ప్రభుత్వం తమకు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఇంత వరకు ఉన్న దయనీయ పరిస్థితులు కొనసాగాలంటే, నచ్చినవారిని ఎన్నుకోవచ్చునని తెలిపారు.
తమ పిల్లలకు మంచి భవిష్యత్తు, సుపరిపాలన కావాలనుకుంటే, ప్రత్యామ్నాయంగా జేఎస్పీ ఉందని చెప్పారు. తమ పార్టీ తరపున అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాలా శ్రమించవలసి వచ్చిందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం బీహార్ మహిళలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం చేయడం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వోద్యోగం ఇస్తానని ప్రకటించడంపై ప్రశాంత్ మండిపడుతూ అవి నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కారని అన్నారు. ప్రజలను వారు తప్పుగా అంచనా వేస్తున్నారని వ్యాఖ్యానించారు.