న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరస్కరించారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మంగళవారం తెలిపారు. 2024 ఎన్నికల సన్నద్ధత కోసం ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సాధికారత కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
ఈ కమిటీలో చేరాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రశాంత్ నిరాకరించారని పేర్కొన్నారు. అయినప్పటికీ, పార్టీ అభివృద్ధి కోసం ప్రశాంత్ కొన్ని సలహాలు, సూచనలు చేయడాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే అంశంపై ప్రశాంత్ కిశోర్ కూడా ట్వీట్ చేశారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యతను తీసుకోవాలంటూ కాంగ్రెస్ చేసిన ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించినట్టు వెల్లడించారు. నిర్మాణపరమైన సమస్యల్లో చిక్కుకుపోయిన కాంగ్రెస్‌కు తన అవసరంకన్నా నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరమన్నారు. కాగా టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకొన్న నేపథ్యంలోనే ప్రశాంత్ కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.