న్యూఢిల్లీ, నవంబర్ 14: శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లయ్యింది జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పరిస్థితి. ఎన్నికలకు ముందు ఆయన రెండు జోస్యాలు చెప్పారు. ఒకటి తన సొంత పార్టీ గురించి, మరొకటి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ గురించి. అయితే ఆకాశం లేకపోతే పాతాళం అంటూ జేఎస్పీపై ఆయన చెప్పిన ఎన్నికల జోస్యం నూటికినూరు శాతం ఫలించింది. సొంత పార్టీని ఒక్క సీట్లో కూడా పీకే గెలిపించుకోలేకపోయారు. ఇక జేడీయూ విషయానికి వస్తే ఆ పార్టీ 25 స్థానాలకు మించి గెలవలేదని చెప్పిన జోస్యం వికటించింది. జేడీయూ గెలుపు 80 స్థానాలను మించిపోయింది.
బీహార్‌లోని మొత్తం 243 స్థానాలలో తన అభ్యర్థులను బరిలోకి దించాలని జేఎస్పీ భావించినప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి బీజేపీ అగ్ర నాయకుల కారణంగా తమ అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సకాలంలో దాఖలు చేయలేకపోయారంటూ పీకే ఆరోపించారు. ఆఖరికి బీహార్‌లో జేఎస్పీ బోణీ కొట్టలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయారు. బీహార్ అంతటా అనేక నెలలపాటు పాదయాత్ర చేసిన తర్వాత ఎంతో ఆర్భాటంగా పీకే జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లకు పైగా గెలుచుకుంటుందని వేసిన అంచనా తప్పడంతో పీకే అంచనాలపై ప్రజలలో సందే హం ఏర్పడింది.
ఐప్యాక్ వ్యవస్థాపకుడిగా నరేంద్ర మోదీతో మొదలుకొని నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉద్ధవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్ వంటి ఎందరో నేతలకు అధికారం దక్కడంలో ఎన్నికల వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించారు. 2015లో బీహార్ సీఎంగా తిరిగి అధికారాన్ని చేపట్టడంలో సాయపడిన పీకేకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తన సలహాదారుగా నియమించుకుని క్యాబినెట్ హోదా కూడా కట్టబెట్టారు.
ఆ తర్వాత మూడేళ్లకు జేడీయూలో చేరిన పీకేని పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో కూడా నితీశ్ నియమించారు. తన రాజకీయ వారసుడిగా ప్రశాంత్ కిశోర్‌ను నితీశ్ ప్రకటిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఏడాది తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలకు దారితీసిన పౌరసత్వ సవరణ చట్టంపై నితీశ్ వైఖరిని తీవ్రంగా విమర్శించి పార్టీ నుంచి గెంటివేతకు గురయ్యారు. 2021లో మమతా బెనర్జీ తరఫున విజయవంతంగా ప్రచారం నిర్వహించి మూడవసారి పశ్చిమ బెంగాల్ సీఎంగా ఆమె పీఠం దక్కించుకునేందుకు పీకే కృషి చేశారు.