అయోధ్య: అయోధ్యలోని రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరిలో ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని జనవరి 21-23 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో వివిధ పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మందిని ఆహ్వానించాలని ట్రస్టు యోచిస్తున్నదని చెప్పారు. 10 వేల మందికి వసతి, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే అందరికీ ఆహ్వాన పత్రాలు పంపుతామని, భక్తులకు నెలరోజుల పాటు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని వివరించారు.