Congress tit-for-tat | నేపాల్ పర్యటనలో ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లిన కాంగ్రెస్‌నేత రాహుల్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాడీవేడిగా ట్వీట్ల యుద్ధం సాగుతున్నది. నేపాల్‌లోని నైట్‌క్లబ్‌లో రాహుల్ ఉన్న వీడియోను బీజేపీ పోస్ట్ చేసింది. దీనికి ప్రతిగా బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ ఉన్న వీడియోను కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ పోస్ట్ చేశారు. ఓ పార్టీలో పాల్గొన్న బీజేపీ ఎంపీ జవదేకర్ ఒక షాంపైన్ బాటిల్ పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరో గుర్తు పట్టండి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను బీవీ శ్రీనివాస్ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే నేత నైట్ క్లబ్‌ల్లో తిరగడం ఏమిటంటూ సోషల్ మీడియాలో బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నది. వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు చేయడం సరి కాదని కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్.. విదేశాల్లోని నైట్‌క్లబ్‌ల్లో విందులు చేసుకుంటున్నారని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ట్విట్ చేశారు. ప్రతిగా మిత్ర దేశంలో స్నేహితుడి పెండ్లికి వెళ్లడం ఏమీ నేరం కాదని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.
ప్రధాని మోదీ మాదిరిగా ఏ పాకిస్థాన్‌లో పిలవని వేడుకకు వెళ్లి నవాజ్ షరీఫ్‌తో కలిసి కేక్ కట్ చేయలేదు కదా. జర్నలిస్టు మిత్రుడి పెండ్లికి హాజరు కావడానికి మిత్రదేశమైన నేపాల్‌కు రాహుల్ వెళ్లారు. ఇదేం నేరం కాదు.. ఇందులో తప్పేం లేదు. మిత్రులు, కుటుంబ సభ్యుల పెండ్లిండ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా నిర్ణయిస్తూ బీజేపీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందేమోనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు.