Prakash Ambedkar | హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్‌లోని సాగర తీరంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరమన్నారు. అంబేద్కర్ ఆదర్శాలను పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు.
సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదన్నారు. అంబేద్కర్ మహావిగ్రహావిష్కరణ మరో చరిత్రకు నాంది పలికిందన్నారు. రూపాయి సమస్యపై 1923లో అంబేద్కర్ పరిశోధనా పత్రం రాశారని, ఆంగ్లేయులు భారత్‌ను ఎలా దోచుకున్నారో గ్రహించారన్నారు. ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దళితబంధు పథకం సమాజంలో కొత్త దిశను చూపించిందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం ఇంకా దూరంగానే ఉందన్నారు.
ఆదివాసీలు, దళితులు వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని అంబేద్కర్ నమ్మారన్నారు. బలిదానాలు జరగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రకాశ్ అంబేద్కర్ ప్రశంసించారు. అంటరానితనాన్ని పారదోలేందుకు అంబేద్కర్ కృషి చేశారని,
కొన్ని అతిచిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ప్రాణత్యాగం చేసే వరకు సమస్య పరిష్కరించలేదన్నారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం జరిగింది. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతిచ్చారు. రూపాయి బలోపేతం ఆవశ్యకతను అంబేద్కర్ నొక్కి చెప్పారన్నారు. దేశానికి రక్షణ సమస్య వస్తే రాజధాని అవసరమని అంబేద్కర్ చెప్పారన్నారు. రెండో రాజధాని హైదరాబాద్ సరైందని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ప్రకాశ్ అంబేద్కర్ గుర్తు చేశారు. పాక్, చైనా నుంచి హైదరాబాద్ ఎంతో దూరంలో ఉంది. రెండో రాజధాని హైదరాబాద్ ఉండాలన్న ఆయన ఆశయం నెరలేదన్నారు.