Prahlad Patel : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చేయి చాచేందుకు అలవాటు పడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజగఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతీబాయ్ లోధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన సందర్భంగా ప్రహ్లాద్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రభుత్వం నుంచి అడుక్కుని తీసుకునేందుకు ప్రజలు అలవాటుపడ్డారు. నేతలు వచ్చినప్పుడల్లా వారికి గంప నిండుగా అర్జీలు ఇస్తుంటారు. స్టేజీలపైన నేతలకు పూలమాలలు వేసి చేతుల్లో అర్జీలు పెడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఇలా అర్థించే బదులు ఇచ్చే అలవాటును పెంపొందించుకోవాలి. దాంతో సమాజంలో సంస్కారం పెరగడంతోపాటు జీవితం ఆనందమయం అవుతుంది’ అన్నారు.
చేయిచాచే వారివల్ల సమాజం బలహీనమవుతుందని, ఉచితాలకు ఆకర్షితులు కావడం ధీర మహిళల లక్షణం కాదని పటేల్ చెప్పారు. అమరులను గౌరవించుకోవడం అంటే వారు చూపిన మార్గంలో వారి ఆదర్శాలకు అనుగూణంగా జీవించడమేనని అన్నారు. నిజమైన దేశభక్తులు చేయిచాచి అర్థించినట్టు మనం ఎక్కడైనా విన్నామా..? అని ప్రశ్నించారు. నర్మదా పరిక్రమ యాత్రికుడిగా తాను దానాలు స్వీకరించానని, కానీ అవి నా కోసం కాదని, నాకు ఏదైనా ఇచ్చినట్లు చెప్పే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు.
ప్రహ్లాద్ పటేల్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు జీతూ పట్వావీ.. పటేల్ వ్యా్ఖ్యలను ఖండించారు. ఆయన రాష్ట్ర ప్రజలను అవమానించారని అన్నారు. ప్రజలను భిక్షగాళ్లు అనే స్థాయికి బీజేపీ అహంకారం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రజల కష్టాలు, ఆశలు, కన్నీళ్లను ఆయన అవమానించారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే భిక్షగాళ్లంటూ అవమానిస్తారా అని మండిపడ్డారు. త్వరలో బీజేపీ నేతలే ఓట్లు అడుక్కుంటూ వస్తారని, అప్పుడు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నారు.