న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు, అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ప్రహ్లాద్ మోదీ ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడవడం కష్టంగా మారిందన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్లో కిలోకు 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యమని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు.
తమకు ఉపశమనం కల్పించి.. ఆర్థిక కష్టాలను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని, దాని ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మెమోరాండం సమర్పించనున్నట్లు తెలిపారు. మరో వైపు బుధవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నట్లు ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్ బసు పేర్కొన్నారు.
అయితే, పశ్చిమబెంగాల్లో అనుసరిస్తున్న దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార, అమ్మేందుకు అనుమతినివ్వాలని ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్లు, పప్పు దినుసులు, వంటనూనెలు కూడా రేషన్ షాపుల ద్వారా అమ్మేలా కేంద్రం చర్యలు చేపట్టాలని ఏఐఎఫ్పీఎస్డీఎఫ్ డిమాండ్ చేస్తున్నది.